ఇది నవశకo. ఉప్పొంగుతూ ఉరకలు వేస్తూ అతి వేగంతో సాగిపోతున్న పాశ్చాత్య నాగరికతా వాహినిలో చిక్కుకొని, దిశ తెలియక, ఊహల గాలులే మార్గదర్శకాలుగా, అలజడిలో పయనిస్తూ, అదే జీవితమనుకొని ఆశల తీరాల కోసo ఎదురుచూస్తూ నడుస్తున్న చిట్టి నావ ఈ శకo.
ఇది నేను పుట్టి పెరిగిన దేశం, ఇది నా మాతృభాష అని గర్వంగా చెప్పుకోదగిన భారతదేశం మనది, తెలుగు భాష మనది. అనంతము, అమృతతుల్యమై, సమస్త విశ్వాన్నీ తమలో ఇముడ్చుకున్న వేదాలు మనవి. అద్వితీయమైన జీవనశాస్త్రము భగవద్గీత మనది.
పరమశివుడోకపరి ఆనందతాండవం చేస్తుంటే దేవతలంతా పరవశులై తమ ఆనందాన్ని వ్యక్తపరచేందుకు భాష లేక హాహాకారాలు చేస్తున్నారట. అప్పుడు పరమేశ్వరుడు తన ఢమరుకం వాయించగా దాని నుండి వెలువడిన 14 శబ్దాల నుండి పుట్టిన దేవభాష సంస్కృతభాష. పాణిని యొక్క సిద్ధాంతకౌముదిని అర్థ0 చేసుకున్నవారికి దివ్యౌషధము వంటి ఆ భాషలోని శాస్త్రీయత బోధపడకుండా ఉంటుందా? అట్టి మహత్తరమైన సంస్కృత భాష మనది కాదా? ఈనాడు ఆధునిక శాస్త్రవేత్తలు సంస్కృతభాషపై జరుపుతున్న పరిశోధనలు దాని ఔన్నత్యాన్ని ఋజువు చేయటం లేదా?
ఇవేవీ ఆలోచించకుండా జిహ్వచాపల్యంతో, అవివేకంతో మన గ్రంథాలను, మన సంస్కృతీ సాంప్రదాయాలను గాలికొదిలేసి "ఆధునికత" అనే మత్తులో మునిగి తేలుతున్న మన దౌర్భాగ్యం ఎంత దుర్భరమైనది? ఆస్ట్రేలియాలో భారత విద్యార్ధులపై జరుగుతున్న దాడులు జాతివివక్ష చర్యగా పేర్కొని మనమంతా వాటిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. అలా అయితే పెరటి చెట్టు అక్కరకు రాదన్న చందంగా మన సంస్కృతీ సాంప్రదాయలకు మొండిచెయ్యి చూపి, పరదేశీయులను, వారి సంస్కృతినే అందలానికెత్తుతూ, మనం స్వధర్మంపై చూపుతున్న సంస్కృతీవివక్ష ఇంకెంత ఘోరమైన తప్పిదం? విచక్షణారహితంగా మనం చేస్తున్న ఈ దుశ్చర్యకు ఏ శిక్ష సముచితమైనది?
మన సొంతమైన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మహాకావ్యాల గూర్చి మనం ఎందుకు తెలుసుకోకూడదు? ఎందుకు గుడ్డిగా వాటిని ప్రక్కన పెట్టెయ్యాలి? ఇంగ్లీషు పాటల సాహిత్యం అర్థం కాకపోతే Google Search చేసి మరీ వాటిని తెలుసుకొని అర్థం చేసుకొనే మనం, ఇంకాస్త శ్రద్ధ పెట్టి మన ప్రాచీన కవుల పాండిత్యాన్ని, వారి గ్రంథాల గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకోకూడదు? వర్డ్స్వర్త్, షేక్స్పియర్ యొక్క రచనల్ని చదివి ఆనందించే మనం ఛoద: శబ్దాలంకారాదియుక్తమై అతి మధురమై విరాజిల్లు ఆంధ్రమహాభారతములోని లోకనీతిని గ్రహించి, ఆ సాహిత్యంలోని తియ్యదనాన్ని ఎందుకు ఆస్వాదించకూడదు?
ఎందరో ఋషుల వంటి మహాకవుల సాహితీ తపోవనాన విరిసి, సువర్ణమణిమయరత్నకాంతులతో దివ్యప్రకాశములైన ఈ కావ్యకుసుమాలు నిర్లక్ష్యపు గాఢ నిశీధిలో కనుమరుగవకముందే మేల్కొ0దా0. ఆ సంజీవనీ పరిమళాలతో భారతీయ సాహిత్యాన్ని మృత్యుoజయిగా నిలుపుదాం.
No comments:
Post a Comment